బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మైలాజికల్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana)పై అంచనాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా నమీత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్’ స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుకలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు (Oscar Award) రాకపోతే తాను తీవ్రంగా నిరాశ చెందుతానని ఫడణవీస్ సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రామాయణ’ చిత్రానికి ఆస్కార్ రాకపోతే నేను అకాడమీ అవార్డ్స్ జ్యూరీపై తీవ్ర నిరాశ చెందుతాను. ఇది కేవలం ఏదో ఒక సాధారణ సినిమా కాదు.. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతూ, రాబోయే వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోయే అద్భుత దృశ్యకావ్యం’’ అని ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గతంలోనూ ఈ ప్రాజెక్ట్ విశిష్టత గురించి ఫడణవీస్ పలుమార్లు ప్రస్తావించారు. ‘‘భారత్‌లో తరతరాలుగా ఎన్నో గొప్ప చారిత్రక, పౌరాణిక కథలు ఉన్నాయి. మన కళ, నాటక రంగం, సంగీతం ఎంతో పురాతనమైనవి. వీటికి ఆధునిక సాంకేతికతను జోడించి నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంది. ‘రామాయణ’ విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. నేను స్వయంగా ప్రధానితో కలిసి ఈ సినిమాకు సంబంధించిన సెట్స్‌ను సందర్శించి, అక్కడ వాడిన విజువల్ క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. కొత్త తరానికి మన పురాణాలను చెప్పడానికి ఇదే సరైన మార్గం. మీరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యుత్తమ దృశ్యరూపంగా నిలుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని ఆయన కొనియాడారు.
ఇదిలా ఉండగా, ఈ మోస్ట్ అవేటెడ్ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇటీవల కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
