ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హాలీవుడ్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’ భారతీయ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఏకంగా రూ.4వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. భారత్‌లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే యాపిల్ టీవీ+ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లోకి అడుగుపెడుతోంది. అక్టోబరు 30 నుంచి ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రాన్ని ఉత్తర భారత ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో ప్రధాన పాత్రలైన లియాస్ బేర్, నిక్కీ ఫ్రీమెన్లకు బాలీవుడ్ ప్రముఖ నటులు వరుణ్ ధావన్, కృతి సనన్ హిందీలో డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రంలోని ప్రసిద్ధ కార్ సీన్‌ను వరుణ్, కృతి రీ-క్రియేట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. థియేటర్లో చూసిన కథకు స్వరం అందించడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని వరుణ్ తెలిపారు. నిక్కీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎంతో సరదాగా సాగిందని కృతి సనన్ పంచుకున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, బేర్ అనే యువకుడు మ్యూజిక్ స్టోర్‌లో పనిచేస్తుంటాడు. అతనికి తన స్నేహితురాలు నిక్కీ అంటే ఎంతో ఇష్టం. కానీ తిరస్కరిస్తుందేమోనన్న భయంతో తన ప్రేమను వ్యక్తపరచలేడు. ఈ క్రమంలో కోరికలను తీర్చే ఒక మాయా స్టిక్ అతనికి దొరుకుతుంది. ‘ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించనంతగా నిక్కీ నన్ను ప్రేమించాలి’ అని అతను కోరుకుంటాడు.
ఆ కోరిక నెరవేరి నిక్కీ అతడిని విపరీతంగా ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే ఆ ప్రేమ రానురాను హద్దులు దాటి భయంకరంగా మారుతుంది. అతనిపై విపరీతమైన ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఎవరితోనూ మాట్లాడనివ్వదు. చివరికి అతడితో మాట్లాడిన ఓ యువతిని సైతం హతమారుస్తుంది. ఈ రకమైన వణుకు పుట్టించే ఉత్కంఠభరిత సంఘటనలతో సినిమా సాగుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ జియో హాట్‌స్టార్‌లో ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి.

