అభిషేక్ సెంచరీపై యువరాజ్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘ‌న విజ‌యం సాధించి.. 5 మ్యాచ్ ల సిరీస్ 3-0తో కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచులో భార‌త‌ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఆరంభం నుంచే సిక్సర్లతో విరుచుకుపడి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. ఆ తర్వాత 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 11 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా 113 పరుగులు సాధించగా, అందులో 102 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం. వైభ‌వ్ సూర్య వంశీ 45 ప‌రుగులతో రాణించాడు.

ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌పై అభిషేక్‌ గురువు, భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 30 లేదా 34 బంతుల్లో సెంచరీ చేయడం తన వల్ల కాదని యువీ సరదాగా పేర్కొన్నాడు. అభిషేక్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడని మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా గొప్పగా రాణించాడని తెలిపాడు. వీరిద్దరి భాగస్వామ్యం ప్రత్యర్థులకు ప్రమాదకరంగా మారిందని చెప్పాడు. సంజు శాంసన్‌ బాధ్యతాయుత ఆటతీరును, బౌలర్ల ప్రతిభను కొనియాడుతూ సిరీస్ గెలిచిన టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు.

గతంలో యువరాజ్ 12 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ‘నా రికార్డును ఇంకా బ్రేక్ చేయలేకపోతున్నావ్’ అంటూ యువీ ఎక్స్‌లో సరదాగా పోస్ట్ చేశాడు. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ మాట్లాడాడు. యువీ లాగా 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ఎవరికైనా చాలా కష్టమైన పని అని చెప్పాడు. తాము వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడబోమని, జట్టు విజయం కోసమే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తాడు. అంతర్జాతీయ స్థాయిలో తొలి 5 ఓవర్లలోనే 100 పరుగులు చేయడం తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓపెనర్లు ఆడిన షాట్లు చూడముచ్చటగా ఉన్నాయని, ఇది టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన అని మెచ్చుకున్నాడు.