హామీలు తీర్చే పనిలో పడ్డారు!

తెలంగాణలో ఉప ఎన్నికల వేళ.. కొత్త ఎత్తులకు శ్రీకారం చుట్టింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన రుణమాఫీ హామీతో పాటు.. టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో క్లారిటీ తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న సూత్రాన్ని అక్షరాలా ఫాలో అవుతున్న కేసీఆర్ ప్రభుత్వం… ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు.. పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెంచడమే టార్గెట్ గా ముందుకు పోతోంది.

ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని పట్టాలెక్కించిన సీఎం కేసీఆర్.. రుణమాఫీని ఆయుధంగా చేసుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. రుణాల వడ్డీ మాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ వస్తున్న వార్తలు.. ఇందుకు బలం తెస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తే.. వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకూ.. పనికొస్తుందన్న వాదన.. తెలంగాణ భవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వరంగల్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు కుటుంబాలు భారీ సంఖ్యలో ఉండడం కూడా… ప్రభుత్వ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.

రైతులతో పాటు.. నిరుద్యోగులను కూడా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంపై హై కోర్టుతో పాటు.. సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో.. టీచర్ పోస్టుల భర్తీ తప్పనిసరిగా మారింది. ఇదే విషయంపై కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ.. నెల నుంచి రెండు నెలల్లోపు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. స్కూళ్లలో ఖాళీలపై ఓ అంచనాకు వచ్చిన విద్యాశాఖ.. ప్రభుత్వ అనుమతితో త్వరలోనే టెట్ తో పాటు.. డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం కావాలని చేసినా.. చేయకపోయినా… వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న ప్రస్తుత సమయంలోనే.. ఇలాంటి కీలక కార్యక్రమాలకు కసరత్తు జరగడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఎన్నికల స్టంటే అని కొందరు వాదించేందుకు ఉపయోగపడుతోంది. కానీ.. చాలా కాలంగా రైతు రుణమాఫీ ప్రక్రియతో పాటు.. డీఎస్సీ విషయంపైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టాయని అధికార పార్టీ నేతలంటున్నారు.