2014లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడన్న మాటేగానీ చంద్రబాబుకు మాత్రం ఎప్పుడూ ఆనందం లేనట్టుగానే ఉంది. బాహుబలి-2 సినిమాలో రాజ్యం రానాకు దక్కినా…..ప్రజాబలం మాత్రం ప్రభాస్‌కి అండగా ఉన్నట్టుగా అధికారం దక్కకపోయినప్పటికీ.. ఎన్నికుట్రలు, ఎంత మంది నట నాయకులు జగన్‌కి వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జగన్‌కి ఉన్న ప్రజాదరణ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ కూడా అనుక్షణం ప్రజల్లో ఉన్న నాయకుల్లో జగనే అగ్రస్థానంలో ఉన్నారని జాతీయ స్థాయి మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రజా సంకల్పయాత్రతో చంద్రబాబు సొంత జిల్లా, నియోజకవర్గంలో కూడా అత్యద్భుత ప్రజాదరణను చూరగొన్నాడు జగన్.
అందుకే ప్రజలకు జగన్‌ని దూరం చేయడం కష్టం అని తలచిన వాళ్ళు…….కనీసం జగన్ పార్టీలో నాయకులు లేకుండా చేద్దామని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కొంత వరకూ సక్సెస్ అయ్యారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపు నియోజకవర్గాల్లో జగన్‌కి ఇంకాస్త ఎక్కువ ప్రజాదరణ ఉండడం గమనార్హం. చంద్రబాబు సొంత సర్వేలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓట్లేయం అని ప్రజలు తేల్చి చెప్పారని పచ్చ మీడియానే చెప్తోంది. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీట్లు ఇచ్చే అవకాశం లేదని టిడిపి నేతలే చెప్తున్నారు.
తన సామాజిక వర్గం బలంగా ఉన్న రాజధాని జిల్లాల్లో వైకాపాను పూర్తిగా ఫినిష్ చేద్దామన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు కొడాలి నాని లాంటి వాళ్ళను పార్టీలోకి తీసుకోవాలని చూశాడు. కానీ కొడాలి నాని బాబు ప్రయత్నాలను తిప్పికొట్టాడు. ఇక నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావుకు గాలం వేశారు. ముఖ్యనాయకుడే బేరం పెట్టాడు. కానీ ‘తన శరీరాన్ని ముక్కలుగా నరికినా జగన్‌ని వీడను’ అని ఆయన ఘాటుగా సమాధానం చెప్పాడు. రాజకీయంగా తనను చేరదీసింది, జీవితాన్నిచ్చింది వైఎస్సార్ అని…ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాన్ని నేను మర్చిపోనని…..జగన్‌ని వీడే ప్రసక్తేలేదని ఘాటుగా సమాధానం చెప్పాడు అప్పారావు. వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని కూడా నూజివీడు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాడు. అప్పారావు సమాధానంతో వైకాపా ఎమ్మెల్యే జంప్ అంటూ నిన్నటి వరకూ అబద్ధపు వార్తలతో హల్చల్ చేసిన పచ్చ మీడియా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయింది. డబ్బులకో, పదవులకో ఆశపడి అధికార పార్టీలోకి జంప్ చేయడం కామన్ అయిపోయిన నేపథ్యంలో అప్పారావు నిబద్ధతను మాత్రం గౌరవించాల్సిందే. కాకపోతే ఇలా విలువలకు కట్టుబడి ఉండేవాళ్ళంటే మాత్రం పచ్చ బ్యాచ్‌కి అస్సలు నచ్చదు. ఎందుకో మరి.
