గతకొంత కాలంగా మహిళా స్వేచ్ఛకు సంస్కరణలు ప్రవేశపెడుతున్న సౌదీ అరేబియా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీఅరేబియాకు చెందిన మహిళలు కూడా ఆర్మీలో చేరవచ్చంటూ చారిత్రక ప్రకటన చేసింది. రియాద్, మక్కా, అల్-ఖాసిం, మదీనా తదితర ప్రొవిన్స్ లలోని మహిళలు సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మార్చి 1 (గురువారం) అని సౌదీఅరేబియా ప్రకటించింది. సౌదీఅరేబియాలో మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్మీలో చేరాలనుకునే ఔత్సాహిక మహిళలు 12 కనీస అర్హతలు కలిగి ఉండాలని సూచించారు. వాటిలో కొన్నింటి వివరాల్లోకి వెళ్తే…1) సౌదీ జాతీయురాలై ఉండాలి.
ఇక ఈ నియామకం యుద్ధంలో పోరాటడం కోసం కాదని.. తాము సైన్యంలో రాణించగలమన్న భావన మహిళలలో పెంపొందించేందుకేననని అధికారులు చెబుతున్నారు. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్బాల్ మ్యాచ్లు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే
1) సౌదీ జాతీయురాలై ఉండాలి
2) 25-35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.
3) హైస్కూలు విద్య పూర్తి చేసి ఉండాలి.
4) వైద్య పరీక్షలు చేసుకోవడం తప్పనిసరి.
5) హైట్ 155 సెంటీమీటర్లకు తగ్గకూడదు.
6) గార్డియన్ అనుమతితోనే సైన్యంలో చేరాలి, తదితర నిబంధనలున్నాయి.
గార్డియన్ అనుమతి తప్పనిసరి అన్న నిబంధనపై మానవహక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కాగా, గత జూన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన రాజు, గత నెలలో మహిళలు కూడా ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడొచ్చంటూ అనుమతినిచ్చారు. తాజాగా ఆర్మీలో చేరొచ్చంటూ నిబంధన విధించారు.
