రెండు మ్యాచ్‌ల తర్వాత కింగ్స్ పంజాబ్ జట్టులో చోటు దక్కించుకున్న గేల్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడు. ఏ బౌలర్ అని చూడకుండా తన దైన శైలిలో చెలరేగిపోయాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించడం ఆరంభించిన గేల్.. 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
గత రెండు సీజన్లలో పేలవ ఆటతీరు కనబర్చిన గేల్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. చివరకు మరి కాసేపట్లో ముగుస్తుందనగా.. సెహ్వాగ్ ధైర్యం చేశాడు. పంజాబ్ యాజమాన్యాన్ని ఒప్పించి రెండు కోట్ల ప్రాథమిక ధరకే గేల్‌ను కొనుగోలు చేశాడు.
తనను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదన్న కసి కావొచ్చు. లేదంటే.. సత్తా చాటాలన్న తపన కావచ్చు.. మూడో మ్యాచ్‌లో తనకిచ్చిన అవకాశాన్ని ఈ కరేబియన్ సద్వినియోగం చేసుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి పంజాబ్‌కు అదిరే ఆరంభాన్నిచ్చాడు
గేల్ దూకుడుతో పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ 75 పరుగులు రాబట్టింది. 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న గేల్.. 33 బంతుల్లో 63 రన్స్ చేశాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడిన గేల్.. 7 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదగా.. పంజాబ్ ఫుల్ ఖుషీ అయ్యింది.
