కొడుకు చేసిన నిర్వాకంతో.. ఏపీ మంత్రి రావెల కిషోర్ అడ్డంగా బుక్కయ్యారు. ఓ మహిళను.. వేధించారన్న ఆరోపణలతో రావెల కిషోర్ బాబు కుమారుడు.. సుశీల్ పై హైదరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. తనను సుశీల్ వేధించాడనీ.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడనీ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో.. సీరియస్ గానే చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక్కడితోనే మంత్రి రావెల పరువు పోయిందని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.
ఆరోపణలు రావడం సహజం.. వాటిని ప్రముఖుల పిల్లలు ఖండించడం అంతకన్నా సహజం. సరిగ్గా ఇలాతే.. నిందితుడు సుశీల్ కూడా.. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని సోషల్ సైట్లలో వాదించాడు. తన కారుకు కుక్కపిల్ల అడ్డొస్తే తప్పించేందుకు ప్రయత్నించాననీ.. అదే సమయంలో ఓ మహిళ తనతో గొడవకు దిగిందనీ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాతే.. అసలు సీన్ మొదలైంది. బాధిత మహిళను.. సుశీల్ కారు వెంబడిస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో ఫూటేజ్.. మీడియాలో దర్శనమిచ్చింది. అది సుశీల్ కారే అని తేలడం, ఆ కారుకు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం వివాదంగా మారింది. దీంతో.. సుశీల్ తప్పు తేలితే శిక్ష ఖాయమనీ, తండ్రిగా తన జోక్యం ఉండబోదనీ రావెల చెప్పాల్సి వచ్చింది.
అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో.. త్వరలోనే రావెలకు కేబినెట్ పోస్ట్ విషయంలో ఇబ్బందులు కూడా ఎదురుకావొచ్చన్న గుసగుస కూడా మొదలైంది.