మల్టీప్లెక్స్‌ల్లో నిలువు దోపీడిపై సంచలన తీర్పు ఇచ్చిన విజ‌య‌వాడ వినియోగదారుల ఫోరం

ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ను అధిక ధరలకు అమ్ముతున్న మల్టిప్లెక్స్ లకు విజయవాడ వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లోకి బయటి నుంచి తినుబండారాలు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లకు ఫోరం మొట్టికాయలు వేసింది.

ఎల్ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీఐ, ఐనాక్స్ మల్టిప్లెక్స్ లకు రూ.5 లక్షలు చొప్పున రూ.25 లక్షల జరిమానా విధించింది. విజయవాడకు చెందిన ఓ వినియోగదారుడు దాఖలుచేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి మాధవరావు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఆహార పదార్థాల ధరలను డిస్ ప్లేలో ఏర్పాటు చేయాలన్నారు.

మల్టిప్లెక్స్ లకు వచ్చే ప్రజలు బయటి నుంచి ఆహార పదార్థాలు, నీళ్లు తెచ్చుకునేందుకు అనుమతించాలని వాటి యాజమాన్యాలను ఫోరం ఆదేశించింది. తమ ఆదేశాలు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలనీ, దీనికి సంబంధించిన నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని అధికారులకు ఫోరం స్పష్టం చేసింది.