ఆకాశానికి ఎగిసిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని దేశవ్యాప్తంగా నేడు భారత్ బంద్ ను నిర్వహిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎల్‌జేడీ నేత శరద్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంద్ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలపడంతో.. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కారు. బస్సు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, కోర్టులు యథావిధిగా పనిచేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని పలు డిపోల ముందు ఆందోళన నిర్వహించారు. ఉప్పల్, ముషీరాబాద్‌లతోపాటు పలు డిపోల ముందు బైటాయించి.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బస్సులు యథాతథంగా తిరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌లో వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ధరలను నిరసిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టాయి. అక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.