క‌బ‌డ్డీ కోర్టులో తొడ కొట్టిన ధోనీ… చూస్తే ఫిదా

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని మరో రకంగా వినియోగించుకుంటున్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లకు విశ్రాంతినివ్వడంతో ధోనీ ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నెల 1 నుంచి ఖాళీగా ఉన్న ధోని.. ప్రచార కార్యక్రమంలో భాగంగా కాసేపు కబడ్డీ మ్యాచ్ ఆడాడు. ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాళ్లని తలపిస్తూ ప్రత్యర్థి కోర్టులోకి కూతకెళ్లిన ధోని.. ఒకరిని ఔట్ చేసి తొడగొట్టడం విశేషం.

ధోనీ కమర్షియల్స్‌ను మేనేజ్ చేసే రితి స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ షూట్‌లో అతడు పాల్గొన్న ఫొటోను ట్వీట్ చేసింది. ఈ షూట్‌లో భాగంగా ధోనీ కబడ్డీ ఆడుతున్నట్లుగా కనిపించాడు. భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఈనెల 21 నుంచి ప్రారంభంకానుండగా.. ధోనీ మాత్రం వచ్చే ఏడాది వరకూ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లేకపోయింది. తొలుత ఆసీస్‌తో మూడు టీ20లు ఆడునున్న టీమిండియా.. ఆ తర్వాత డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకూ నాలుగు టెస్టులు ఆడనుంది. అవి ముగిశాక.. జనవరి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది.

ఇక్కడితో అతని టీ20 కెరీర్ ముగిసినట్లే అన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. అయితే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెలక్టర్లు చెప్పారు. రానున్న ఆస్ట్రేలియా టూర్‌లో ధోనీ కేవలం వన్డే సిరీస్‌లో మాత్రమే కనిపించనున్నాడు.