టీడీపీ ఎమ్మ‌ల్యే అనిత‌కు సమన్లు జారీచేసిన కోర్టు..

టీడీపీ ఎమ్మెల్యే అనిత‌కు విశాఖ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్కు బౌన్స్‌ కేసు కింద విశాఖపట్నంలోని 12వ అదనపు జిల్లా జడ్జి సమన్లు జారీ చేసిన‌ట్లు వేగి శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్‌ తెలిపారు. అనిత 2015, అక్టోబర్ నెలలో తన దగ్గర రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్ట్ డేటెడ్ చెక్కుతో పాటు ప్రామిసరీ నోటును ఇచ్చారన్నారు. ఆ చెక్కును వెయ్య‌వొద్దంటూ చాలా సార్లు అనిత చెప్పింద‌న్నారు. ఆర్ధిక ఇబ్బందుల దృష్ట‌యా డ‌బ్బులు కావాల‌ని ఒత్తిడి చేయ‌డంతో గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్‌ లేదని బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించిన‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని అనితకు కోర్టు సమన్లు జారీచేసిందన్నారు. ఎన్నికల్లో చేసిన అప్పులను తీర్చడం కోసమే అనిత తన దగ్గర నగదు తీసుకున్నారని శ్రీనివాసరావు చెప్పారు.