ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన పూర్తి మద్దతు టీడీపీవైపు ఉండేలా చూసుకుంటున్నారని వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాడితే వారికే మద్దతు తెలుపుతానని చెప్పే శ్రీనివాస్.. టీడీపీకి ఫేవర్‌గా కొంచెం ఎక్కవగా పనిచేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ప్రత్యేక హోదా పోరాటాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించారు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రత్యేక హోదా పోరులో కలిసి రావాలని కోరినా అంటి ముట్టనట్టు.. ఉన్నానంటే ఉన్నట్టు ఉన్న చలసాని.. చంద్రబాబు ప్రత్యేక హోదా రాగం తీయగానే తాళం అందుకున్నారు. దగ్గరుండి ఆయన దీక్షలకు, పోరాటాలకు మద్దతు తెలిపారు. దీనంతటికి ఓ కారణం ఉందని పోలిటికల్ సర్కిళ్లలో ఓ టాక్ నడుస్తోంది ఇప్పుడు.
చలసాని టీడీపీకి మద్దతుగా పనిచేస్తే రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే చలసాని శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని తెలుస్తోంది. హోదా కోసం అలుపెరగకుండా కష్టపడుతుంది బాబే అన్నట్టు టీవీ డిబెట్‌లలో చర్చిస్తున్నారు.
ఇక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతోందని.. అప్పుడే రాష్ట్రానికి లాభమని.. విభజన హామీలు నెరవేరుతాయని చలసాని అన్నారు. టీఆర్ఎస్‌తో చేతులు కలిపిన వైఎస్ఆర్‌సీపీతో ఎప్పటికైనా రాష్ట్రానికి నష్టమేనంటూ ఆయన సెలవిచ్చారు. చూస్తుంటే చంద్రబాబు అభిమానం చురగొనే పని చలసాని ప్రారంభించినట్టే ఉందంటున్నారు విశ్లేషకులు.