పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం లూసిఫర్.బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తాచాటింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా L2ఎంపురాన్ రానుంది. మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం ఇది.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా L2 ఎంపురాన్ లో ఖురేషి అబ్రమ్‌గా సూపర్‌స్టార్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఖురేషి పాత్రను పరిచయం చేయటంతో లూసిఫర్ సినిమా ముగుస్తుంది. L2 ఎంపురాన్ విషయానికి వస్తే ఆ పాత్రను మరింత విస్తృతంగా ఆవిష్కరించబోతున్నారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నారు.
లూసిఫర్ లో స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో మోహన్ లాల్ తెల్లటి చొక్కా, పంచె ధరించి ఉంటారు. ఖురేషి అబ్రమ్ విషయానికి వస్తే ఆ పాత్రలో మోహన్ లాల్ నల్లటి దుస్తులను ధరించి ఉన్నారు. అతని వెనుక ఏదో తెలియని రహస్యం దాగిందని తెలుస్తోంది. ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో రానుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.