సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా భారీ బడ్జెట్, హంగులతో నెట్‌ఫ్లిక్స్ (Netflix) నుంచి మరో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్ రాబోతోంది. అదే ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar). టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వార్ యాక్షన్ డ్రామా, ఆగస్టు 7వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
అభిజీత్ సింగ్ పార్మార్, కుషాల్ శ్రీవాత్సవ సంయుక్తంగా తీర్చిదిద్దిన ఈ సిరీస్‌కు ఓనీ సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధార్థ్ ధైర్యశాలి అయిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజాగా కనిపించనున్నారు. ఆయనతో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చరిత్రలో నిలిచిపోయిన కార్గిల్ యుద్ధం (1999) నేపథ్యంలో ఈ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 1999 మే 26న ప్రారంభమైన కార్గిల్ యుద్ధ సమయంలో, భారత వైమానిక దళం (IAF) శత్రువులపై నిర్వహించిన సాహసోపేతమైన వైమానిక దాడులకు పెట్టిన పేరే ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. ఈ ఆపరేషన్‌లో ‘ది గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించింది. శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు మన వైమానిక దళం చేసిన పోరాటాన్ని ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. విడుదలైన ట్రైలర్లో మంచు కొండల మధ్య యుద్ధ విమానాల విన్యాసాలు, వైమానిక దళం చేపట్టిన సాహసాల విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
