ప్రముఖ నటుడు విజయ్ (Vijay) ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న సానుకూల మార్పుల పట్ల టాలెంటెడ్ యాక్టర్ ఆర్. మాధవన్ స్పందించారు. తన ఆప్తమిత్రుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి రావడం, రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్, రాష్ట్ర రాజకీయాలతో పాటు తన వ్యక్తిగత అభిప్రాయాలు, రాబోయే సినిమాల విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అంతా మంచే జరుగుతోందని, ఇంత త్వరగా సమాజంలో మార్పు వస్తుందనే నమ్మకం తనకు ఇప్పుడు కలిగిందని తెలిపారు. ‘‘నాకు విజయ్ చాలా కాలంగా మంచి స్నేహితుడు. మేమిద్దరం ఎంతో కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నాం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఆయన్ను ఎంతో గౌరవపూర్వకంగా ‘సీఎం విజయ్’ అని పిలవాల్సిందే’’ అని ఆయన సంతోషంగా పేర్కొన్నారు. అయితే రాజకీయం అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని, అక్కడ తప్పు చేస్తే కచ్చితంగా విమర్శిస్తారని, మంచి చేసినా కొన్నిసార్లు విమర్శలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఏ రంగంలో ఉన్నా ఇతరులను విమర్శించేందుకు ఎప్పుడూ కొందరు సిద్ధంగానే ఉంటారని మాధవన్ స్పష్టం చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తనకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా నిస్వార్థమైన ప్రజాసేవ చేయాలనే బలమైన దృక్పథం ఉండాలని, కానీ ప్రజలను నడిపించాలనే కానీ, ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని, ఆ విషయంలో తాను కాస్త స్వార్థపరుడినే అని నవ్వుతూ చెప్పారు. తన వృత్తి (నటన) ద్వారా తనకు చేతనైనంతలో సమాజానికి మేలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. తనకు మొదటినుంచీ రాజకీయాలపై పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ నాయకుడినైనా గౌరవించాలనే కనీస స్పృహ తనకు ఉందని మాధవన్ వెల్లడించారు.
మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవితకథ ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘జి.డి.ఎన్’ (GDN) చిత్రంతో మాధవన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ బయోపిక్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
