మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు గత కొంతకాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి చేతులు కాల్చుకున్న తేజు ఈసారి తన పంథాను మార్చుకుని ప్రేమ కథల స్పెషలిస్ట్ దర్శకుడు అయిన కరుణకరన్‌తో ‘తేజ్ ఐలవ్యూ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలోసాయి ధరమ్ తేజ్‌కు జంటగా అనుపమపరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మరి ఈ సినిమా అయిన సాయి ధరమ్ తేజ్‌కు హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం రండీ!
కథ : చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్ (సాయి ధరమ్ తేజ్) పెదనాన్న(జయప్రకాష్)తో కలిసి ఉంటాడు. అయితే ఓ హత్య విషయమై తేజ్ జైలుకి వెళ్తాడు. అక్కడే పెద్దవాడై రిలీజ్ అవుతాడు. జైలు నుండి వచ్చిన తేజ్ ను ఇంట్లోకి రానివ్వడు పెదనాన్న దీనితో హైదరాబాద్ వెళ్లి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. ఆ ట్రైన్ జర్నీలో నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిన తేజ్ ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. కొంతమంది స్నేహితులను ఏర్పరచుకుని మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ రన్ చేస్తుంటాడు. ఈలోగా అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ లో నందిని తన గతాన్ని మర్చిపోతుంది. నందినికి గతాన్ని గుర్తుచేయాలని తేజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. తన ప్రేమ ద్వారా నందినిని ఎలా మళ్లీ మాములు మనిషిని చేశాడు..? నందిని, తేజ్‌ల ప్రేమ ఎలా ముగిసింది అన్నది సినిమా కథ.
నటీనటుల ప్రతిభ : సాయి ధరమ్ తేజ్ నటన ఈ సినిమాలో తెలిపోయిందనే చెప్పాలి. లవర్‌బాయ్ గా జస్ట్ ఓకే అనిపించాడు. అనుపమ అందం, అభినయం ఆకట్టుకుంది. ప్రేయసిగా ఆమె మెప్పించింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వైవా హర్ష మిగతా వారంతా కామెడీ పంచారు. జయ ప్రకాశ్ లాంటి వారు ఎప్పటిలానే సహజ నటనతో ఆకట్టుకున్నారు.
కథనం : హీరో, హీరోయిన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఆమె కోసం ఏదైనా చేసే హీరో తెగింపు.. ఇంతలోనే ఆమెకు కష్టం రావడం.. ఆ కష్టం నుండి హీరో ఆమెను కాపాడటం ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఇందులో హీరోయిన్ యాక్సిడెంట్ లో తన గతం మర్చిపోతుంది. వసంతకోకిల సినిమాను గుర్తుకు తెస్తుంది తేజ్ ఐ లవ్ యు. సినిమా చూస్తున్నంతసేపు చూస్తుంటే కరుణాకరణ్ ఇదవరకు సినిమాల ప్రభావం కనిపిస్తుంది. ప్రభాస్ డార్లింగ్ సినిమా ఎఫెక్ట్ తేజ్ ఐలవ్యూ మీద చాలా ఉందనిపిస్తుంది. కథ పాతదే.. కథనం కూడా పాత పద్ధతిలోనే నడిపించారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న తేజూ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.చెప్పాలనుకున్న కథను ఎంట్రటైనింగ్ గా చెబుతున్నామని మాత్రమే ఆలోచించిన దర్శకుడు తాను ఇదవరకే ఇలాంటి పంథా కొనసాగించాడని గుర్తుచేసుకోలేదు. తేజూ ఈసారైనా హిట్ కొడతాడని ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్ కు నిరాశే కలిగిందని చెప్పొచ్చు.
బోటమ్ లైన్ : సాయి ధరమ్ తేజ్ దర్శకులను కాకుండా కథలను నమ్ముకుంటే మంచింది.