- Advertisement -

‘వారణాసి’పై బిగ్ అప్‌డేట్!

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న‌ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’111. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్‌గా అలరించనున్నారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి జక్కన్న రాజమౌళి తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను, సినిమా ప్రస్తుత స్థితిని పంచుకున్నారు.

ఇప్పటికే ‘వారణాసి’ సినిమాకు సంబంధించి దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు రాజ‌మౌళి. ఇంకా కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంద‌ని.. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలు, భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఇప్పటికే పూర్తి చేశామ‌న్నారు. ప్రస్తుతం మిగిలినవి కొన్ని చిన్న చిన్న సన్నివేశాలే. 2022 నుంచి ఈ కథను డెవలప్‌ చేయడం మొదలు పెట్టామ‌న్న రాజ‌మౌళి.. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు దాదాపు నాలుగున్నరేళ్లు పట్టిందని రాజమౌళి వెల్లడించారు.

సినిమా నేపథ్యం గురించి చెబుతూ.. తనకు ‘ఇండియానా జోన్స్‌’ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని, ఆ కథలోని సాహసాలు అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు. కథ, నేపథ్యం పూర్తిగా తెలిస్తేనే ప్రేక్షకులు సినిమాను పూర్తిగా ఆస్వాదించగలరని, అందుకే ‘వారణాసి’ గ్లింప్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి విడుదల చేశామని చెప్పారు. ఈ సినిమా ప్రయాణం వారణాసిలో మొదలై, అంటార్కిటికా, ఆఫ్రికా మీదుగా రామాయణ కాలానికి వెళ్ళి, మళ్లీ తిరిగి వారణాసికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ఇక ఈ సినిమాను పూర్తిగా ఐమ్యాక్స్‌ (IMAX) ఫార్మాట్‌లో తీయడానికి ప్రధాన కారణం కథలోని భారీతనమేనని రాజమౌళి స్పష్టం చేశారు. అంటార్కిటికాలో 300 అడుగులకు పైగా ఎత్తైన మంచు కొండలు, రామాయణ కాలం నాటి భారీ వానర సేన వంటి అద్భుతమైన విజువల్స్‌ను వెండితెరపై అత్యంత విశాలంగా చూపించడానికే ఈ ఫార్మాట్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టఫర్‌ నోలన్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సినిమాల ప్రభావం తనపై ఉంటుందని చెప్పారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్ని హంగులను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ విజువల్ వండర్‌ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -