తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఏడాది అగ్ర హీరోలతో పాటు ప్రముఖ నటీమణులు వరుసగా గాయాల బారిన పడుతుండటం కలకలం రేపుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్‌ల షూటింగ్స్‌లో నిమగ్నమైన సెలబ్రిటీలు తీవ్ర గాయాలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం ‘#NBK111’ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్నారు.
మరోవైపు ఆయన బాటలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భుజం గాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన భుజానికి గాయమైంది. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి వైద్య బృందం కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి అని సూచించింది. మరో క్రేజీ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో ఆయన మణికట్టుకు గాయమైంది. దీనికోసం ఇటీవల కోయంబత్తూరు వెళ్లి ఆయన ప్రత్యేకంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతికి బెల్ట్‌తో కనిపించగా, గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, పవన్‌కల్యాణ్ ఇటీవల ముంబయిలో విజయవంతంగా సర్జరీ ముగించుకున్న సంగతి తెలిసిందే.
ఈ స్టార్ హీరోల జాబితాలోకి తాజాగా ప్రముఖ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా చేరారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా ఆమె గాయపడ్డారు. వైద్యులు పరీక్షించి ఆమెకు తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు గుర్తించారు. తక్షణమే రష్మిక కనీసం ఆరు వారాలపాటు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనకుండా సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం స్పష్టం చేసింది.
ప్రస్తుతం రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మైసా’. యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆమె గోండు తెగకు చెందిన శక్తివంతమైన మహిళగా కనిపించనున్నారు. కథానాయిక ప్రాధాన్యమున్న ఈ సినిమా కోసం రష్మిక ఇటీవల కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు అండర్‌వాటర్ సీక్వెన్స్‌ను కూడా ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తాజాగా ఒక పాట షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
