కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన స్టార్ హీరో యశ్ , నటి రష్మిక మందన్న గతంలో తనపై చేసిన ఓ కామెంట్‌పై ఎట్టకేలకు స్పందించారు. సుమారు 2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆఫ్’ (Mr. Show Off) అంటూ వ్యాఖ్యానించిన సంగతి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ ఈ వివాదంపై తనదైన శైలిలో పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో తనకు తెలియదని, అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల అలా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
టీవీ షోలలో యాంకర్లు ఇచ్చే కొన్ని ఆప్షన్లలో తనకు ఏది సరిపోతుందనిపిస్తే దానిని ఎంచుకుని ఉంటారని, తాను మాత్రం ఆ విషయాన్ని పెద్దగా మనసులో పెట్టుకోలేదని యశ్ స్పష్టం చేశారు. ఎవరి అభిప్రాయాలు వారివని, కానీ ఎవరో ఒకరు చెప్పే అభిప్రాయాన్ని బట్టి తన వ్యక్తిత్వం లేదా క్యారెక్టర్ మారదని తేల్చిచెప్పారు. ఇతరుల దృష్టికోణం తనను నిర్వచించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి యశ్ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సహ నటీనటులను, తోటి కళాకారులను గౌరవించని వారు ఎప్పటికీ తన అభిమానులు కారంటూ ఫ్యాన్స్‌కు హితవు పలికారు. కాగా, రష్మిక ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో యశ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు యశ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలు, వివాదాలపై కూడా యశ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ అశ్లీలతను ప్రోత్సహించనని, ఇది పూర్తిగా ప్రస్తుత తరానికి, యువత కోసం రూపొందించిన సినిమా అని వివరణ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ లో యశ్ పవర్‌ఫుల్ రావణాసురుడి పాత్రలో నటిస్తుండటం విశేషం.
