ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత చారిత్రాత్మక మేడారంలో పర్యటించిన సీఎం, గిరిజన సంస్కృతి సంప్రదాయాల నడుమ డోలు వాయిద్యాల మధ్య వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం), చీర, సారె, పసుపు, కుంకుమలు సమర్పించి సీఎం రేవంత్‌రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర వేదికపై మంత్రితో పాటు ఇతర నాయకులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం ములుగు చేరుకున్న సీఎం, గట్టమ్మ దేవాలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నూతన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లాలో సుమారు రూ. 868 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. గడచిన బీఆర్‌ఎస్ హయాంలో మేడారం వనదేవతలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క, సారలమ్మ దేవయాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించానని, సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. ములుగు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, మల్లూరు నరసింహస్వామి ఆలయాభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని, అలాగే జంపన్న వాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కొందరు రాజకీయ నేతల తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తం పంచుకు పుట్టకపోయినా తాము మంత్రి సీతక్కను సొంత ఆడబిడ్డలా చూసుకుంటున్నామని తెలిపారు. కానీ కొందరు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే దురాశతో సొంత చెల్లినే ఇంటి నుంచి బయటకు నెట్టేశారని విమర్శించారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు రాష్ట్రంలోని కోట్లాది మంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కొడుకు తప్పు చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫాంహౌస్‌లో పడుకున్నారని, సొంత బిడ్డను వెళ్లగొడుతుంటే మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లేనని, అలాంటి తండ్రీకుమారులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు ప్రజలు ఇబ్బందులు పడాలని కొందరు క్షుద్ర పూజలు చేయించారని విమర్శించారు. ఏదేమైనా దేవుడి దయతో వర్షాలు కురిశాయని, ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
