విడుదలకు సిద్ధంగా పలు సినిమాలు
సినిమా వారం వచ్చేసింది. గురు, శుక్రవారాలు సినిమా వాళ్లకు పండుగే. వాళ్లకు ఈ రెండు రోజులపైనే తమ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అలాంటి వారు ఈ రెండు రోజుల్లో తమ సినిమాలు విడుదల చేసుకుంటారు. వారంలో ఈ రెండు రోజుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు పలు సినిమాలు ఉన్నాయి. గత నవంబర్ నెలలో దాదాపు 40 సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి. కానీ ఎవరికీ గుర్తులేవు. ఈసారి ఈనెల రెండోవారం హాస్య నటుడు సప్తగిరి, యాంకర్ రవి, కొత్త నటీనటులతో రూపొందిన సినిమాలు వస్తున్నాయి. ఆ వివరాలేమిటో చూద్దాం..!
గురువారం విడుదలయ్యే సినిమా సప్తగిరి ఎల్ఎల్బీ
తన హాస్యంతో అందరినీ అలరిస్తున్న హాస్య నటుడు సప్తగిరి డిసెంబర్ 7వ తేదీన గురువారం సప్తగిరి ఎల్ఎల్బీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడు చరణ్ లక్కాకుల, సంగీతం బుల్గానిన్.
శుక్రవారం (డిసెంబర్ 8) విడుదలయ్యే సినిమాలు
మళ్లీరావా చాన్నాళ్ల తర్వాత అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్ సినిమా తెరపై కనిపించనున్నాడు. అకాంక్ష సింగ్తో జంటగా మళ్లీ రావాగా సుమంత్ రానున్నాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను రూపొందించాడు. నిర్మాత రాహుల్ యాదవ్, సంగీతం శ్రావణ్ భరద్వాజ్ అందిస్తున్నాడు.
ఇది మా ప్రేమకథ
బుల్లితెర యాంకర్ కథనాయకుడు రవి హీరోగా నటించిన ఇది మా ప్రేమకథ సినిమా వస్తోంది. పటాస్ ఫుల్ టూ బిందాస్ షోతో మంచి పేరు సంపాదించుకున్నరవి ఈ సినిమాతో సినీ పరిశ్రమలోకి రానున్నాడు. మేఘనా హీరోయిన్గా నటిస్తోంది. అయోధ్య కార్తీక్ దర్శకత్వం వహించగా మత్స క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా నిర్మించింది.
ఆకలి పోరాటం
రామ్ సాయి గోకులం క్రియేషన్స్ నిర్మాణంలో ఆకలి పోరాటం సినిమా వస్తోంది. ఆనంద్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గంగాధర్, రేణుక, హరీశ్, వినయ్, హారిక ప్రధాన పాత్రల్లో సినిమా వస్తోంది.
దీంతో పాటు బీటెక్ బాబులు అనే సినిమా కూడా విడుదలవుతోంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ నందు, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో బీటెక్ బాబులు వస్తోంది. ఈ సినిమాలో ఆలీ, తాగుబోతు రమేశ్, షకలక శంకర్ నటిస్తున్నారు.