బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన, అమానుష ఘటన వెలుగు చూసింది. కేవలం భోజనం వడ్డించడం ఆలస్యమైందనే చిన్న కారణంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. కన్న వదినను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీసిన ఈ రాక్షస ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెహానాబాద్ జిల్లాకు చెందిన అన్షు దేవి (25), ధర్మేంద్ర కుమార్ దంపతులు. ఘటన జరిగిన రోజు భర్త ధర్మేంద్ర కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి పొలాలకు పనుల నిమిత్తం వెళ్లగా, ఇంట్లో అన్షు దేవి ఒక్కటే ఉంది. అదే సమయంలో ఆమె మరిది కునాల్ కుమార్ ఇంటికి వచ్చి తనకు వెంటనే భోజనం పెట్టాలని కోరాడు. అయితే భోజనం వడ్డించడంలో కొద్దిగా ఆలస్యం అయింది.
ఈ చిన్న విషయానికి తీవ్ర ఆగ్రహానికి లోనైన కునాల్ కుమార్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి గొడ్డలితో అన్షు దేవిపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఎవరికీ లేనంతటి పైశాచికత్వంతో మృతురాలి తలను తీసుకెళ్లి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ భయానక దృశ్యాన్ని చూసి గ్రామస్థులు హడలిపోయారు.
అయితే హత్య చేసిన అనంతరం నిందితుడు ఏమాత్రం భయపడకుండా, అక్కడి నుంచి పారిపోకుండా ఇంటి సమీపంలోనే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని నిందితుడు కునాల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడు నిత్యం డ్రగ్స్ మత్తులో జోగుతుంటాడని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. మాదకద్రవ్యాల ప్రభావం వల్లే అతను ఈ అరాచకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.
