మైన‌ర్ బాలికపై అఘాయిత్యం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు!

దేశ రాజధాని దిల్లీలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. నమ్మి స్నేహితుల వెంట వెళ్లిన ఓ మైనర్ బాలిక వారి చేతుల్లోనే అఘాయిత్యానికి గురైంది. సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం శవాన్ని పొలాల్లో పడేయడంతో, ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న వైనం తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు కొద్ది రోజుల క్రితం బయటకు వెళ్లింది. ఆ ఫ్రెండ్‌తో పాటు అతనికి తెలిసిన మరో ముగ్గురు మైనర్లు కలిసి ఒక టెంపోలో ప్రయాణించారు. ఆ వాహనంలోనే వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో ఆ మైనర్లు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత భయంతో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని ఉత్తర దిల్లీలోని స్వరూప్‌ నగర్ ప్రాంతంలోని పొలాల్లోకి విసిరేశారు.

సెప్టెంబర్ 13న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేనంతగా కుళ్లిపోయింది. ఒక చేయి శరీరం నుంచి వేరుపడి ఉండగా, శరీర భాగాలను కుక్కలు పీక్కుతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి రోజులు గడుస్తున్నా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడం గమనార్హం. బాలిక తరచుగా ఇంటి నుంచి వెళ్లిపోయేదని, అందుకే ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు.

ఘటనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ फुటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఒక టెంపో కదలికలను గుర్తించి సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆ టెంపో ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తేల్చారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.