ఉత్తర్ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో పెను విషాదం చోటుచేసుకుంది. రబుపుర ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోని వారంతా అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతులను మహేష్ (37), ఆయన భార్య లలిత (35), వారి పిల్లలు లడ్డు (11), మిష్టి (7), సాక్షాత్ (3)గా గుర్తించారు. శుక్రవారం రాత్రి వీరంతా కలిసి నూడుల్స్ తిని, ఆపై టీ తాగినట్లు మహేష్ తల్లి పోలీసులకు వివరించారు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్న వారు ఉదయానికి శవాలుగా మారారు. నూడుల్స్ కలుషితం కావడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజనింగ్తో మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరణాలకు గల అసలు కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు. ఆహార భద్రతా విభాగం అధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లో కుటుంబసభ్యులు తిన్న ఆహార పదార్థాలు, మిగిలిన నూడుల్స్ నమూనాలను సేకరించారు. వాటిని ఫోరెన్సిక్, ల్యాబ్ పరీక్షలకు పంపించారు. పూర్తి నివేదిక వచ్చాకే మరణానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం మహారాష్ట్రలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇలాగే మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబయికి చెందిన అబ్దుల్లా డోకాడియా కుటుంబం వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోయింది. అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగిందని వైద్యులు తేల్చారు. ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో కూడా దాదాపు అలాంటి ఘటనే పునరావృతం కావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

