కావ్యా మారన్‌ – అనిరుధ్ వివాహం.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌కు ఆహ్వానం!

సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్‌ల వివాహం త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో వీరి పెళ్లి విందు ఆహ్వాన ప్రక్రియ ఊపందుకుంది. చెన్నైలో నవంబరు 21న గ్రాండ్‌గా జరగనున్న వివాహ విందుకు హాజరుకావాలంటూ కళానిధి మారన్ దంపతులు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

ఇందులో భాగంగా సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ తన సతీమణితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె కావ్య, అనిరుధ్ వివాహ విందుకు రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి దంపతులకు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

అనంతరం వారు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాసానికి వెళ్లారు. కేటీఆర్ దంపతులను కలిసి పెళ్లి విందుకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. చెన్నైలో జరిగే రిసెప్షన్‌కు తప్పకుండా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనిరుధ్, కావ్య గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. గతంలో ఈ వార్తలను అనిరుధ్ తోసిపుచ్చారు. అయితే వీరి వివాహం నవంబరు 10, 11 తేదీల్లో గ్రీస్ దేశంలో అత్యంత వైభవంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత నవంబరు 21న చెన్నైలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు.