భర్తను అతి కిరాతకంగా అంతం చేసి, అతను విదేశాలకు వెళ్లాడంటూ అందరినీ నమ్మిస్తూ రెండేళ్లుగా కాలం వెళ్లదీసిన ఓ ఇల్లాలి దారుణ బండారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని జామ్‌నగర్ పారిశ్రామికవాడలో పోలీసులు గురువారం జరిపిన సోదాల్లో వెలుగుచూసిన ఈ సంచలన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌కు చెందిన జిగ్నేశ్ మావడియా, పృథ్వి అలియాస్ భూమిబెన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్లలోపు వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే భార్య పృథ్వికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే దురాలోచనతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ఆమె పక్కా ప్లాన్ వేసింది.
పథకం ప్రకారం 2024 మే 31వ తేదీ రాత్రి పృథ్వి తన ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మందు పార్టీ ఉందని జిగ్నేశ్‌ను నమ్మించింది. అతడికి సైనైడ్ కలిపిన మద్యాన్ని తాగించారు. ఆ విష మందు ప్రభావంతో జిగ్నేశ్ ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే వారు పారిశ్రామికవాడలోని ఓ షెడ్డులో 12 అడుగుల లోతైన గోతిని తవ్వి మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ గోతి పైభాగంలో అడుగు మేర బలమైన కాంక్రీటు వేసి ఆధారాలను పూర్తిగా మాయం చేశారు.
అంతటితో ఆగకుండా జిగ్నేశ్ ఉద్యోగ నిమిత్తం ఉన్నపళంగా ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని పృథ్వి తన కుటుంబసభ్యులకు, బంధువులకు అబద్ధాలు చెబుతూ కట్టుకథలు అల్లుతూ వచ్చింది. అలా రెండేళ్ల పాటు అందరినీ నమ్మిస్తూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో జిగ్నేశ్ బంధువు ఒకరు ఆస్ట్రేలియాకు వెళ్తూ.. అక్కడ జిగ్నేశ్ ఉంటున్న అడ్రస్ ఇవ్వాలని పృథ్విని కోరాడు. దీంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు జామ్‌నగర్‌లోని ఆ షెడ్డులో జేసీబీ సహాయంతో త్రవ్వకాలు జరిపి, గురువారం పన్నెండు అడుగుల గోతి నుంచి అస్థిపంజరాన్ని వెలికితీశారు. దర్యాప్తులో అది జిగ్నేశ్ అస్థిపంజరమేనని నిర్ధారించుకున్నారు. పోలీసుల విచారణలో నిందితురాలు పృథ్వి తన నేరాన్ని అంగీకరించింది. ఆమెతో పాటు ఈ హత్యకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహం చేసుకుని, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తను ప్రియుడి మోజులో పడి కామాంధురాలు పొట్టనబెట్టుకున్న తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
