ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది. ఈ ఎన్యుమరేషన్ (ఓటర్ల సర్వే) ప్రక్రియలో నమోదు చేసిన డేటా ఆధారంగా ఈసీ పలు కీలక వివరాలను బహిర్గతం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది తమ ఎన్యుమరేషన్ ఫారాలను అధికారులకు సమర్పించినట్లు స్పష్టం చేసింది. అయితే, వివిధ కారణాల వల్ల ఇంకా 44,89,512 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్లు ఈసీ పేర్కొంది.
ఓటరు జాబితా వడపోతలో భాగంగా అధికారులు గుర్తించిన ప్రధాన అంశాలు పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాలకు మారినవారు (Shifted) మరియు నివాసాల్లో అందుబాటులో లేని ఓటర్ల సంఖ్య 22.30 లక్షలుగా తేలింది.
ఒకరి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు 7.37 లక్షల మంది ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించి, అత్యంత పారదర్శకమైన తుది ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈ సవరణ ప్రక్రియ కొనసాగుతోందని ఈసీ తెలిపింది. జాబితాలో పేర్లు లేనివారు, సవరణలు కోరేవారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
