హరియాణాలోని గురుగ్రామ్ సూరత్ నగర్‌లో చోటుచేసుకున్న ఓ యువకుడి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య విడాకులు కోరడం, ఆపై ఇంట్లోనే భర్త ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనంటూ మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో ఈ ఉదంతం మరింత సంచలనంగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని సూరత్ నగర్‌కు చెందిన సంజీవ్ యాదవ్ (36) ఓ ప్రైవేట్ కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో సంజీవ్ భార్య మన్‌ప్రీత్ కౌర్, వారి ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. సంజీవ్ ఉరివేసుకుంటున్న భయానక దృశ్యాలను ఏడేళ్ల కుమారుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఉరివేసుకోవడం చూసి భయపడిన మన్‌ప్రీత్ వెంటనే సహాయం కోసం కేకలు వేసిందని, అనంతరం తన కుటుంబ సభ్యులతో పాటు సంజీవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే పోలీసుల వాదనను మృతుడి కుటుంబ సభ్యులు పూర్తిగా ఖండిస్తున్నారు. సంజీవ్ సోదరి కిరణ్ మాట్లాడుతూ.. భార్య మన్‌ప్రీత్ విడాకులు కోరడంతోనే కొద్దికాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర వివాదాలు, మనస్పర్థలు కొనసాగుతున్నాయని తెలిపారు. తన సోదరుడి మరణంపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక మృతుడి తండ్రి రామ్‌సేవక్ యాదవ్ తన కోడలిపై నేరుగా అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడిని భార్యే పథకం ప్రకారంగా కుట్ర పన్ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మన్‌ప్రీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
సంజీవ్, మన్‌ప్రీత్‌లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని డెన్సో కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. వీరికి 2019లో ఒక కుమారుడు జన్మించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి అసలు కారణాలు స్పష్టమవుతాయని సబ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ సింగ్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
