- Advertisement -

ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నారా?

- Advertisement -

చైల్డ్‌ పోర్నోగ్రఫీ (చిన్నారుల అశ్లీల వీడియోలు) వ్యసనంగా మారిన వారిపై నిఘా నీడ కమ్ముకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారులకు సంబంధించిన అసభ్యకర వీడియోలను చూస్తూ, వాటిని ఇతరులకు పంపుతున్న ఓ కేటుగాడి గుట్టును అమెరికా నిఘా సంస్థ వెలుగులోకి తెచ్చింది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూడటంతో తీవ్ర కలకలం రేపింది. ఆన్‌లైన్‌లో చిన్నారుల వేధింపులు, అశ్లీల కంటెంట్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన చర్యల నేపథ్యంలో ఈ ఉదంతం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలోని గాజులరామారానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో విపరీత పోకడలకు పోయాడు. బాలురను లైంగికంగా వేధిస్తున్నట్లు ఉన్న అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ నిఘా సంస్థ ‘నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌’ (NCMEC) గుర్తించింది. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఈ అసాంఘిక కార్యకలాపాన్ని పసిగట్టిన ఆ సంస్థ, వెంటనే ఆ సమాచారాన్ని సైబర్ టిప్‌లైన్ ద్వారా ‘జాతీయ నేర నమోదు రికార్డుల బ్యూరో’ (NCRB) అధికారులకు చేరవేసింది.

అక్కడి నుంచి ఈ సమాచారం అత్యంత వేగంగా రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగానికి చేరింది. అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన ఐపీ అడ్రస్‌ (IP Address) ఆధారంగా లోతుగా విచారణ జరిపారు. ఆ టెక్నికల్ డేటా సాయంతో నిందితుడు వాడుతున్న ఫోన్ నంబర్‌ను, అతడి అసలు చిరునామాను ఖరారు చేశారు.

ఈ సమాచారం ఆధారంగా జీడిమెట్ల పోలీసులు నిందితుడిపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారుల అశ్లీల వీడియోలను వీక్షించడం, వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వంటి నేరాలకు పాల్పడితే చట్టపరంగా ఎంతటి కఠిన శిక్షలుంటాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఆన్‌లైన్ వేదికలపై ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడే వారిపై నిఘా మరింత కఠినతరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -