ప్రస్తుతం సోషల్ మీడియాలో బెంగళూరు ఓటర్ల జాబితా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నగరంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏకంగా 65 లక్షల ఓట్లు తొలగించగా, ఆ జాబితాలో తన ఓటు కూడా ఉందంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘సర్’ (SSR) ప్రక్రియ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో నా ఓటు కూడా ఉండటం నిజంగా చాలా హాస్యాస్పదంగా, విడ్డూరంగా అనిపిస్తోంది. నేను ఎక్కడో పుట్టి పెరిగిన వ్యక్తిని కాను.. సరిగ్గా ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే నివసిస్తున్నాను. నా చదువంతా ఇక్కడే పూర్తయింది. ఇక్కడే నటన నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇదే నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా (ఎంపీ అభ్యర్థిగా) పోటీ చేశాను. అలాంటి నా ఓటును సైతం ఓటర్ల జాబితా నుంచి తొలగించారు’’ అని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు.
మళ్లీ కొత్తగా ఓటరు కార్డు పొందడానికి అధికారులు ఏయే డాక్యుమెంట్లు అడుగుతారో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తాను నిబంధనల ప్రకారం అన్ని పత్రాలతో సిద్ధంగా ఉన్నానని, ఏ ధ్రువీకరణ పత్రాలు సమర్పించడానికైనా తాను రెడీ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఇంత భారీ స్థాయిలో అవకతవకలు జరగడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడి ఓటే గల్లంతు కావడం, అందునా ఆయన గతంలో ఎంపీగా పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల సంఘం చేపడుతున్న ఇలాంటి ప్రత్యేక సవరణల వల్ల సాధారణ ప్రజలు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో దీనివల్ల స్పష్టమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎన్నికల అధికారులు ఏవిధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.
