ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి కిరాతకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మృతురాలిని 30 ఏళ్ల సోనమ్గా పోలీసులు గుర్తించారు. నిందితుడు సుఖ్బీర్ సింగ్, సోనమ్ పదకొడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుఖ్బీర్ హర్యానాలోని హిసార్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవాడు. దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల అతను తన స్వగ్రామమైన జగత్పూర్కు వచ్చాడు.
స్వగ్రామానికి వచ్చినప్పటి నుంచి భార్య ప్రవర్తనపై సుఖ్బీర్కు అనుమానం పెరిగింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. ఇకపై తప్పు చేయనని సోనమ్ చెప్పినప్పటికీ, భర్త మనసులోని అనుమానం మాత్రం తొలగిపోలేదు.
ఘటన జరిగిన రోజు ఉదయం సుఖ్బీర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఒక సీసాలో పెట్రోల్ తీసుకువచ్చి ఇంట్లోని భార్యపై పోశాడు. ఆమెను కుర్చీకి కట్టేసి నిప్పంటించి గదికి తాళం వేసి పారిపోయాడు. మంటలు భారీగా చెలరేగడంతో సోనమ్ అక్కడికక్కడే సజీవ దహనమైంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటన్నర శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. నిందితుడు సుఖ్బీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ జరుపుతున్నారు.

