- Advertisement -

మాజీ ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య!

- Advertisement -

నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులో ఘోర విషాదం వెలుగుచూసింది. కట్టుకున్న భర్త, ఏ పాపం తెలియని ఏడాది వయసున్న కన్నకూతురిని వదిలేసి.. ఒక వివాహిత తన మాజీ ప్రియుడితో కలిసి మామిడి తోటలో ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లూరు గ్రామానికి చెందిన శివ (25), రేణుక (23) గతంలో ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను ఇరువైపులా ఉన్న తల్లిదండ్రులు పూర్తిగా నిరాకరించారు. దీంతో రెండేళ్ల క్రితం పెద్దలు రేణుకకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఏడాది వయసున్న ఒక పాప ఉంది. పెళ్లయి వేరే కాపురం పెట్టినప్పటికీ రేణుకకు పాత జ్ఞాపకాలు పీడించడంతో.. వారం రోజుల క్రితం ఆమె తన మాజీ ప్రియుడు శివతో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ భర్తకు దొరికిపోయింది. ఈ విషయమై భర్త ఆమెను గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురైన రేణుక.. వెంటనే బిడ్డను తీసుకుని ఎల్లూరులోని తన పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న వేళ రేణుక తన ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా బయటకు వెళ్లిపోయింది. కాసేపటికి పాప గట్టిగా ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా రేణుక కనిపించలేదు. రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆమె జాడ దొరకలేదు. కట్ చేస్తే.. ఈరోజు ఉదయం గ్రామ శివారులోని ఒక మామిడి తోటలో రేణుక, ఆమె మాజీ ప్రియుడు శివ ఇద్దరూ ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కొల్లాపూర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలు సేకరించారు. ఆవేశంలో కన్నకూతురి భవిష్యత్తును కూడా ఆలోచించకుండా మాజీ ప్రియుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -