పురుషులలో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్‌లలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. అయినప్పటికీ దీనిపై ఉన్న కొన్ని అపోహలు మరియు తప్పుడు నమ్మకాల వల్ల చాలా మంది స్క్రీనింగ్ (పరీక్షలు) చేయించుకోవడానికి మరియు దీని గురించి మాట్లాడటానికి వెనుకాడుతున్నారు. ఈ వ్యాసంలో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు, వయసు, పీఎస్‌ఏ (PSA) టెస్ట్, చికిత్స మరియు మనుగడపై ఉన్న సాధారణ అపోహల వెనుక ఉన్న నిజాలను వైద్యులు వివరిస్తున్నారు.
పురుషులు సాధారణంగా చర్చించడానికి ఇష్టపడని ఆరోగ్య విషయాలలో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఇది తమకు రాదని, వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దురదృష్టవశాత్తూ, ఈ నిశ్శబ్దమే దీనిపై అనేక అపోహలు ప్రచారమవడానికి కారణమైంది.
కోల్‌కతాలోని ఆర్‌జీ స్టోన్ యూరాలజీ & లాపరోస్కోపీ హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ జీషాన్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. పురుషులను వేధించే క్యాన్సర్‌లలో ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా సాధారణమైనది. దీనిని ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. అందుకోసం అపోహలను వీడి నిజాలను తెలుసుకోవడం మొదటి అడుగు.
చాలా మంది పురుషులు తాము మూత్రవిసర్జన సాధారణంగానే చేస్తున్నామని, ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తూ అంతా బాగుంది అనుకుంటారు. కానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను చూపించదు. మూత్రవిసర్జనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం రావడం లేదా పెల్విక్ (నడుము/పొత్తికడుపు) నొప్పి వంటి లక్షణాలు కనిపించే సమయానికి, వ్యాధి తదుపరి దశకు చేరుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువ ముప్పు ఉన్నవారు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
వయసు పైబడిన వారికి ముప్పు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ, ఈ క్యాన్సర్ కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. 40, 50 ఏళ్ల వయసున్న పురుషులలోనూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా ప్రొస్టేట్ క్యాన్సర్ చరిత్ర (Family History) ఉంటే ఈ ముప్పు మరింత ఎక్కువ. వయసు, కుటుంబ నేపథ్యం మరియు మొత్తం ఆరోగ్యాన్ని బట్టి స్క్రీనింగ్ ఎప్పుడు అవసరమనేది వైద్యులు నిర్ణయిస్తారు.
ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ‘పీఎస్‌ఏ’ (Prostate-Specific Antigen – PSA) రక్త పరీక్షను సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే పీఎస్‌ఏ స్థాయిలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు. ప్రొస్టేట్ గ్రంథి వాపు (Enlarged Prostate), ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాల వల్ల కూడా పీఎస్‌ఏ స్థాయిలు పెరగవచ్చు. క్యాన్సర్‌ను ఖరారు చేయడానికి మరింత లోతైన పరీక్షలు అవసరమవుతాయి.
కొన్ని రకాల ప్రొస్టేట్ క్యాన్సర్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అటువంటి సందర్భాలలో, వైద్యులు వెంటనే సర్జరీ లేదా రేడియేషన్ చికిత్సల జోలికి వెళ్లకుండా ‘యాక్టివ్ సర్వైలెన్స్’ (Active Surveillance) ను సిఫార్సు చేస్తారు. అంటే, క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తూ ఆ క్యాన్సర్ పెరుగుదలను నిశితంగా గమనిస్తూ ఉంటారు. రోగి పరిస్థితిని బట్టి సరైన విధానాన్ని ఎంచుకుంటారు.
చికిత్స తర్వాత వచ్చే దుష్ప్రభావాల (సైడ్ ఎఫెక్ట్స్) భయంతో చాలా మంది పురుషులు వైద్య సలహా తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. మూత్ర నియంత్రణ కోల్పోవడం (Urinary Incontinence) లేదా లైంగిక సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో చికిత్సా విధానాలు చాలా మెరుగయ్యాయి. రోబోటిక్ సర్జరీ, టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ మరియు నరాలకు నష్టం జరగకుండా చేసే అత్యాధునిక శస్త్రచికిత్సల (Nerve-sparing techniques) వల్ల కాంప్లికేషన్స్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ అని నిర్ధారణ కావడం భయానక విషయమే అయినప్పటికీ అది ప్రాణాంతకమైన చివరి దశ అని భావించకూడదు. ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే సరైన చికిత్స తర్వాత చాలా మంది పురుషులు సాధారణ, చురుకైన జీవితాన్ని గడుపుతున్నారు. వ్యాధి ముదిరిన దశలో ఉన్నప్పటికీ, ఆధునిక వైద్య విధానాల ద్వారా వ్యాధిని అదుపులో ఉంచి, రోగి ఎక్కువ కాలం నాణ్యమైన జీవితాన్ని గడిపేలా చేయవచ్చు.
ప్రొస్టేట్ క్యాన్సర్ విషయంలో వ్యాధి కంటే కూడా దానిపై ఉన్న తప్పుడు సమాచారమే ఎక్కువ హాని చేస్తుంది. లక్షణాలు, స్క్రీనింగ్ మరియు చికిత్సపై అపోహలను నమ్మడం వల్ల సరైన సమయంలో నిర్ధారణ మరియు చికిత్స పొందడం ఆలస్యం కావచ్చు. కాబట్టి, అవగాహన కలిగి ఉండటం మరియు మీ వైద్యుడితో మీ ఆరోగ్య ప్రమాదాల గురించి ముందే మాట్లాడటం చాలా మంచిది. ఆ ఒక్క సంభాషణే మీ ఆరోగ్యానికి అత్యంత కీలకమైన అడుగు కావచ్చు.
