షర్మిలకు జగన్‌ రాసిన లేఖ ఇదే!

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలకు రాసిన లేఖను వైఎస్సార్‌సీపీ అధికారికంగా విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని పార్టీ పేర్కొంది. ప్రజలకు అసలైన నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ లేఖను బయటపెట్టినట్లు స్పష్టం చేసింది. చంద్రబాబు తన తప్పులను పక్కదోవ పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించింది.

లేఖలో జగన్ తన మేనకోడలు అంజలి వివాహంపై స్పందించారు. అంజలి పెళ్లి నిశ్చయం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా తమ మధ్య ఎన్నో విభేదాలు, పరిణామాలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. అయినప్పటికీ అంజలి జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చిన్నప్పటి నుంచి ఆమె పెరుగుదలను చూశానని, ఆమెకు ఎల్లప్పుడూ మంచి జరగాలనే కోరుకుంటున్నానని తెలిపారు.

బెంగళూరులోని తన సొంత నివాసంలో వివాహం నిర్వహించాలన్న ఆలోచనపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను నివసిస్తున్న ఆ ప్రాంగణంలో వివాహం జరిపితే తీవ్ర భద్రతా సమస్యలు తలెత్తుతాయని వివరించారు. పెళ్లికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, డెకరేటర్లు, క్యాటరింగ్ వర్కర్లు, కొత్త వ్యక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని గుర్తుచేశారు. నివాస ప్రాంగణ దృశ్యాలు బయటకు వెళ్లడం వల్ల వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. తన కుమార్తెలు హర్ష, వర్షల వివాహాల విషయంలోనైనా ఇదే నిర్ణయం తీసుకునేవాడినని స్పష్టం చేశారు.

ఈ కారణాలతో బెంగళూరు నివాసం కాకుండా మరో అనువైన వేదికను ఎంచుకోవాలని షర్మిలకు సూచించారు. కన్వెన్షన్ సెంటర్లలో గానీ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికల్లో గానీ వేడుక జరపవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే, హైదరాబాద్‌లోని తన లోటస్ పాండ్ ఆస్తిని ఉపయోగించుకోవచ్చని మరోసారి జగన్ ప్రతిపాదించారు. కుటుంబ భద్రత దృష్ట్యా తన పరిస్థితిని, దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.