సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని అమాయకులకు యూకే (UK) వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన ఒక పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ (Nandu’s World) ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన మరియు ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ దంపతులపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. గత ఏడాది నవంబరులోనే ఈ కేసు నమోదైనప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. యూకేలో స్థిరపడిన ఈ దంపతులకు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లలో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తి తన వీసా రెన్యువల్‌తో పాటు భార్యకు యూకేలో ఉద్యోగం, సీవోఎస్ (సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్) కోసం లండన్‌లో పరిచయమైన మధుకర్‌ను సంప్రదించారు. మధుకర్ సూచన మేరకు గుంటూరులోని వారి కన్సల్టెన్సీ కార్యాలయంలో ఉన్న అతని తండ్రి మోహన్‌రావును కలిసి 2023లో రూ. 15 లక్షలు చెల్లించారు. అయితే, నగదు తీసుకున్న కొన్నాళ్లకు మధుకర్ పంపిన సర్టిఫికెట్ నకిలీదని బాధితుడు గుర్తించాడు. సదరు యూకే కంపెనీ యజమానిని ఆరా తీయగా.. తన పేరుతో మధుకర్ తప్పుడు లేఖ సృష్టించాడని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు నిలదీయగా కేవలం రూ. 2 లక్షలు ఇచ్చి చేతులెత్తేయడంతో, పోలీసులను ఆశ్రయించాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్ (A1), రమానందన (A2), మోహన్‌రావు (A3)లపై కేసు నమోదు చేయగా, ఈ కేసును క్వాష్ చేయాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ దంపతుల చేతిలో కేవలం ఏపీ, తెలంగాణలోనే కాకుండా గుజరాత్, రాజస్థాన్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ చాలా మంది బాధితులు ఉన్నట్లు, ఒక్కొక్కరి నుండి సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై యూట్యూబర్ రమానందన తన ఛానల్ ద్వారా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతోనే కొందరు ఇదంతా పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ పేర్లు చెప్పుకుని కొందరు ఇండియాలో సొమ్ము చేసుకుంటున్నారని, తన పేరిటగానీ, భర్త పేరిటగానీ ఎలాంటి కంపెనీలు లేవని చెప్తూ.. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో అప్రమత్తంగా ఉండాలని ఆమె తన సబ్‌స్క్రైబర్లను కోరారు. ప్రస్తుతం ఈ వీసా స్కామ్ వ్యవహారం నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
