నా వాళ్ల‌పై చేయి వేస్తే నాపై వేసినట్లే: జగన్‌

కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పులివెందులలో మంగళవారం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు మరో రెండేళ్లు ఓపిక పట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ‘జగన్‌ 2.0’ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించారు.

పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చేయి వేస్తే తనపై వేసినట్లేనని జగన్‌ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు, అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు చంద్రబాబు కోసం కాకుండా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రిటైర్డ్ అధికారులను సైతం వెతికి మరీ విచారణ జరుపుతామని హెచ్చరించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల పట్ల కూటమి నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై మహిళల నామినేషన్లను అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. పులివెందులలో కేవలం 20 వార్డుల్లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని తెలిపారు. స్క్రూటినీ పేరుతో అభ్యర్థుల పత్రాలను అన్యాయంగా తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులను ప్రశ్నించిన తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని జగన్ మండిపడ్డారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిపై 37 రౌండ్ల కాల్పులు జరిపారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల సంఘం తీరు మారలేదని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధైర్యంగా పోరాడాలని జగన్‌ పిలుపునిచ్చారు.