ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో భారీ అక్రమాలు మరియు అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నియామకాలపై సమగ్రమైన సీబీఐ (CBI) విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఇతర వైఎస్సార్‌సీపీ నేతలతో కలసి గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ముఖ్యంగా మెగా డీఎస్సీలోని మొత్తం 441 పోస్టులకు సంబంధించి, స్పోర్ట్స్ కోటా కింద ఉన్న ఉద్యోగాలను డబ్బులకు అమ్ముకున్నారని మరియు తనకు కావలసిన వారికి అక్రమంగా కేటాయించారని ఆరోపించారు.
ఈ అక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుగానే జీవోలను మార్చి కుట్ర చేసిందని ఆయన వివరించారు.పరీక్ష నిర్వహణకు ముందు అమల్లో ఉన్న జీవోను రద్దు చేసి, నారా లోకేష్ అనుకూల అభ్యర్థులకు లబ్ధి చేకూరేలా కొత్త జీవోను తీసుకొచ్చారు..సాధారణంగా స్పోర్ట్స్ కోటాకు 2 శాతం రిజర్వేషన్ ఉండాల్సి ఉండగా, దానిని 3 శాతానికి పెంచడమే కాకుండా.. స్పోర్ట్స్ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు.
నియామక ప్రక్రియ ముగిసిన వెంటనే మళ్లీ పాత జీవోను అమల్లోకి తీసుకొచ్చారు.ఈ అక్రమాల కారణంగా నవీన్ అనే అర్హుడైన అభ్యర్థి నష్టపోయి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అంబటి పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతను మోసం చేసిందని అంబటి రాంబాబు విమర్శించారు.డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. పరీక్షకు ముందు తర్వాత జీవోలను ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి..మెగా డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ ద్వారా మాత్రమే బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
