ఏపీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అభ్యర్థుల ఎంపిక కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఇప్పటివరకు నాలుగు జాబితాలను విడుదల చేయగా త్వరలో ఐదో జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్.
ఓ వైపు అభ్యర్థుల మార్పు మరోవైపు పార్టీ కార్యకర్తలతో వరుసగా సమావేశాలు కానున్నారు జగన్. దీనికి తోడు ప్రభుత్వ పరంగా మరిన్ని పథకాలు తీసుకొచ్చి ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగేలా ప్రణాళిక సిద్ధం చేశారు జగన్.
ఇందులో భాగంగా ప్రధానంగా పెన్షన్ పెంపు,ఐఆర్ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ, 4 వేలకు పెంపు , మహిళలకు ఉచిత బస్పు ప్రయాణం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు జగన్. అలాగే రైతులకు రుణమాఫీ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు పీఆర్సీపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. నివేదికకు సమయం ఉండటంతో ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మొత్తంగా అభ్యర్థుల ప్రకటన తర్వాత జగన్ ఎన్నికల వేళ ఎలాంటి హామీలు ప్రకటిస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.