బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు వినిపించిన పేరు ఆశన్నగారి జీవన్ రెడ్డి. వందల ఎకరాలకు రైతు బంధు నుండి భూముల ఆక్రమణ వరకు ప్రతీ అంశంలో జీవన్ రెడ్డే హైలైట్ అయ్యేవారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసింది ఆయన్నే. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టారు జీవన్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ , కరెంట్ బిల్లులు చెల్లించలేదు. దీంతో ప్రాపర్టీ ట్యాక్స్ రు.10 కోట్లు,విద్యుత్ బిల్లులు రు. 2 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీనికి జీవన్ రెడ్డి స్పందించకపోవడంతో కరెంట్‌ను కట్ చేశారు అధికారులు. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మాస్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇక ఇది ప్రాసెస్‌లో ఉండగానే మరో గుది బండ పడింది. తన బార్య పేరుతో జీవన్ రెడ్డి 2017లో ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర రు. 20 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పటి నుండి అసలు సంగతి పక్కన పెడితే వడ్డీ కూడా చెల్లించడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అధికారులెవరు ధైర్యం చేయలేదు. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ మారడంతో అధికారులు కొరడా ఝుళిపించారు. గడువులోగా అప్పు చెల్లించకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక అప్పు తీసుకుంది ఆర్టీసీ స్థలంలో మాల్ కట్టడానికి. ఇలా మొత్తంగా ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు జీవన్ రెడ్డి.
ఇలా తీగ లాగితే డొంక కదిలినట్లు జీవన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు అధికారంలో ఉండటంతో ఏమి కాదని ధీమాలో ఉన్న జీవన్ రెడ్డి జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని అక్రమాలు బయటపడతాయోనని ప్రజలంతా చర్చించుకుంటున్నారు.