ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం వ్యవస్థీకృత దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం అమలు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అక్రమాలపై నిలదీశారు. పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని ఆయన ప్రశ్నించారు.
నామినేషన్ల స్వీకరణ దశలోనే కాకుండా పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియలోనూ భారీగా అక్రమాలు జరిగాయని సజ్జల వెల్లడించారు. ప్రొద్దుటూరులో భద్రత కల్పిస్తామన్న పోలీసులే వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిని టీడీపీ గూండాలకు అప్పగించారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే అభ్యర్థిపై దాడి చేసి, నామినేషన్ పత్రాలను లాక్కున్నారని తెలిపారు. నగరి, కనిగిరి, రాజంపేటలలో చెల్లుబాటయ్యే పత్రాలున్నా నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ నామినేషన్లను అధికారులు తిరస్కరించారని వివరించారు.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం వల్లే టీడీపీ ఎన్నికల్లో పోటీకి భయపడుతోందని ఆయన విమర్శించారు. అందుకే ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి దొడ్డిదారిన ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మార్చిలోనే మున్సిపాలిటీల పదవీకాలం ముగిసినా నిర్వహించకుండా, ఇప్పుడు దసరా పండుగ వేళ హడావుడిగా ఎన్నికలు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. లక్షలాది దొంగ ఓట్లు, మృతుల పేర్లు ఉన్న పాత ఓటర్ల జాబితాతోనే పోలింగ్ జరపడం వెనుక దురుద్దేశం దాగి ఉందని ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎంవోకు అనుబంధ విభాగంలా మారిపోయిందని సజ్జల వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల స్థాయిలోనే ఇంతటి హింస జరిగితే, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ దౌర్జన్యాలు తీవ్ర ప్రాణనష్టానికి దారితీయకముందే కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు టీడీపీ పాలనపై ఈ ఎన్నికల ద్వారా తగిన తీర్పు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

