ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీడీపీకి రోజుకో తలనొప్పి సమస్యగా మారింది. ఓ వైపు జనసేనతో పొత్తు సమస్య, మరోవైపు అభ్యర్థుల బుజ్జగింపు వెరసీ చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశీస్తున్న అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు బాబు.
అయితే ఈ మొత్తం పరిణామ క్రమంలో చంద్రబాబుకు లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగింది. ఇప్పటికే బ్రదర్స్ వార్‌లో విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీ దూరం కాగా ఇప్పుడు ఒంగోలు బ్రదర్స్ వంతు వచ్చేసింది. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పోరు చంద్రబాబుకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.
ఒంగోలు అసెంబ్లీ టికెట్ కోసం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఆయన సోదరుడు దామచర్ల సత్యకు మధ్య పోరు తారాస్థాయికి చేరింది. 2014లో జనార్థన్ గెలుపొందగా 2019లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి టికెట్ తనకేననే ధీమాలో ఉన్నారు జనార్థన్. అయితే ఆయన ఊహించని విధంగా టికెట్ కోసం జనార్ధన్ బాబాయ్ కుమారుడు సత్య కూడా పోటీ పడుతున్నారు. దీంతో వైసీపీతో పోరు కాస్త ఇంటిపోరుగా మారింది. లోకేశ్ ద్వారా జనార్ధన్‌కు సీటు దక్కకుండా సత్య విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రోజుకో తలనొప్పి చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తోందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.