భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు మరో సారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వైసీపీ హయాంలో భోగాపురం కోసం తీసుకున్న నిర్ణయాలు.. పురోగతిని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో అసలు ఏం చేసారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి అనుమతుల నుంచి అన్ని రకాల పనులు తమ హాయంలోనే చేసామని వివరించారు. చంద్రబాబు క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అన్నట్లుగా మారారని జగన్ ఎద్దేవా చేసారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వేళ మాజీ సీఎం జగన్ ఎక్స్ ఖాతాలో కీలక అంశాలను వెల్లడించారు. అందులో ..” ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది.అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్ని స్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. అంటూ జగన్ పేర్కొన్నారు.
అదే విధంగా ..” చంద్రబాబు గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ? అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ..” అంటూ జగన్ పేర్కొన్నారు.
దీంతో పాటుగా..” ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకు రాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం. కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి…అంటూ జగన్ అసలు విషయం బయట పెట్టారు.
