జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నిర్ణయాలు, విధానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లే క్రమంలో మరిన్ని స్పష్టమైన, పునర్నిర్మితమైన కమిటీలను ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నూతన కమిటీల నియామకం పూర్తయ్యే వరకు పార్టీ నాయకులు, ప్రతినిధులు ఎవరూ అనుసరించాల్సిన మార్గదర్శకాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలు ప్రకటించేంత వరకు ఎవరూ పార్టీ తరఫున విలేకరుల సమావేశాలు నిర్వహించకూడదని లాగే ఎలక్ట్రానిక్ మీడియా టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.
ఎటువంటి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ లేదా ప్రింట్ మీడియా వేదికలపై జనసేన పార్టీ పేరుతో ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు లేదా ప్రకటనలు చేయడానికి వీల్లేదని ఆదేశించారు. నూతన కమిటీలను అధికారికంగా నియమించిన తర్వాత మాత్రమే, బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులు టీవీ చర్చల్లో మరియు మీడియా సమావేశాల్లో పాల్గొనాలని సూచించారు.
హఠాత్తుగా అధికార ప్రతినిధుల కమిటీని రద్దు చేయడం మరియు నూతన నియామకాలు జరిగే వరకు జనసేన పేరును మీడియాలో ప్రస్తావించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
