సెంట్రల్ ఢిల్లీలో హైఅలర్ట్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో దాదాపు లాక్‌డౌన్ తరహా వాతావరణం ఏర్పడింది.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఢిల్లీ అంతటా భారీగా పోలీసులను మోహరించింది. దుకాణాలు, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ అర్ధరాత్రి నుంచే మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నారు.

ప్రజా రవాణాపై కూడా తీవ్ర ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేయనున్నారు. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో రైలు రాకపోకలను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో హోటళ్లు, పీజీ హాస్టళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సెంట్రల్ ఢిల్లీ పరిధిలో సెక్షన్ 163 BNS చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఎలాంటి ధర్నాలు, సభలకు అనుమతి లేదని పోలీసులు మైకుల ద్వారా ప్రకటిస్తున్నారు. దీంతో రేపటి సీజేపీ ఆందోళనకు పోలీసులు అధికారికంగా అనుమతి నిరాకరించారు.

భద్రత కోసం దాదాపు 23 వేల మంది కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. కీలక ప్రాంతాలలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. శాంతియుత నిరసనలకు వేరే ప్రాంతం చూపాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే అనుమతి లేకున్నా నిరసన చేపడతామని సీజేపీ ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.