స్థానిక సంస్థల ఎన్నికలు..ఈసీకి YSRCP కీల‌క లేఖ‌

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) రంగంలోకి దించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మూడు వేర్వేరు లేఖలు సమర్పించారు. వీటి ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, భౌతిక దాడులు పెరుగుతున్నాయని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అవుతోందని పేర్కొంది. భద్రతా బాధ్యతలను కేవలం స్థానిక పోలీసులకే వదిలేస్తే పారదర్శకత ఉండదని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులకు ఆటంకం కలుగుతోందని ఆరోపించింది.

కేవలం పోలింగ్ రోజే కాకుండా, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచే కేంద్ర బలగాలను మోహరించాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫలితాల ప్రకటన ముగిసేవరకు ఈ బలగాల పర్యవేక్షణ కొనసాగాలని కోరారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బలవంతపు ఉపసంహరణలు చేయించడం వంటి చర్యలను అరికట్టాలని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు తమ నామినేషన్లను జిల్లా కేంద్రాల్లోనూ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. స్థానిక ప్రాంతాల్లో భయాందోళనలు ఉన్నందున ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌లు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సున్నితమైన ప్రాంతాల్లో స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ బృందాలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలకు అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, అధికారులను రాజకీయ ఒత్తిళ్లకు గురిచేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.