ఏపీలో ప్రతీకార రాజకీయాలే నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ నేతలు పై వీలైతే దాడులు లేకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులతో కేసులు పెట్టించడం ఏదోరకంగా ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. తాజాగా విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాస్‌పై అలాంటి ప్రయత్నమే చేశారు.
దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిబ్బంది అడ్డుకున్నారని ఎల్లో మీడియా కోడై కూస్తున్న నేపథ్యంలో స్పందించారు అవినాష్. తన తండ్రి పుట్టుకతోనే ధైర్యాన్ని ఇచ్చారని ఎవరికి భయపడే ప్రసక్తేలేదన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని… తాను ఎక్కడికీ పారిపోయే రకం కాదని తేల్చి చెప్పారు.
కోర్టు తాను తప్పుచేశానని భావిస్తే.. ఆ తీర్పును ఎదుర్కొంటానని కానీ అక్రమ కేసులకు భయపడే రకం కాదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా కేసులకు భయపడలేదని గుర్తు చేశారు. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉంటానని వీడియో రిలీజ్ చేశారు.
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీసులో వస్తువులను ధ్వంసం చేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై కేసుల్లో విచారణనను ముమ్మరం చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వీరిపై తొందపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది.