మనం ప్రతిరోజూ అమ్మతో మాట్లాడుతుంటాం.. భోజనం చేశావా? , టాబ్లెట్ వేసుకున్నావా? , ఇంట్లో అందరూ బాగున్నారా? .. ఇలాంటి మాటలెన్నో మన దైనందిన జీవితంలో భాగం. కానీ, మీరు ఎప్పుడైనా మీ అమ్మతో నిజంగా మాట్లాడారా? అంటే.. ఆమె మనసులోని భావాలను, ఆమె కలలను లేదా ఆమె పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకునేలా ఎప్పుడైనా సంభాషించారా?
చాలా మంది తమ తల్లులతో నిత్యం టచ్లో ఉన్నా, వారి అంతరాత్మను తాకలేకపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం?
చాలా మంది సంభాషణలు కేవలం బాధ్యతగా లేదా సమాచార మార్పిడి లాగే సాగుతాయి. అమ్మ ఆరోగ్యంగా ఉందా? తిన్నదా? అనే విషయాలకే ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఆమె ఆ రోజును ఎలా గడిపింది? ఆమె మనసులో ఏముంది? అనే విషయాలను అడగడం మర్చిపోతాం.
మనం అమ్మను కేవలం ఒక “తల్లి” పాత్రలో మాత్రమే చూస్తాం. కానీ తల్లి కావడానికి ముందు ఆమెకో పేరు, కొన్ని ఇష్టాయిష్టాలు, కొన్ని లక్ష్యాలు ఉండేవని మనం గుర్తించాలి. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, ఆమెకు నచ్చిన పాత పాటలు లేదా ఆమె చేయాలనుకుని చేయలేకపోయిన పనుల గురించి మాట్లాడితే, ఆ బంధం సరికొత్తగా మారుతుంది.
మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆఫీస్ టెన్షన్లు అన్నీ అమ్మకు చెబుతుంటాం. ఆమె మన మాటలన్నీ ఓపిగ్గా వింటుంది. కానీ, ఆమె చెప్పే మాటలను మనం అంతే శ్రద్ధగా వింటున్నామా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆమె చెప్పే చిన్న చిన్న విషయాల్లోనే ఆమెకు మనపై ఉన్న ప్రేమతో పాటు ఆమెకు కావాల్సిన ‘భరోసా’ కూడా దాగి ఉంటుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ తల్లులు ఒంటరితనానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వారికి కావాల్సింది కేవలం ఆర్థిక సహాయం లేదా సౌకర్యాలు మాత్రమే కాదు. మన సమయం మరియు మానసిక మద్దతు. ఆమె చెప్పే విషయాలు కొన్నిసార్లు మనకు అవసరం లేనివిగా అనిపించవచ్చు, కానీ ఆమెకు అవి ప్రపంచం.
“ఏం చేస్తున్నావ్?” అని కాకుండా, “ఈరోజు నీకు బాగా నచ్చిన విషయం ఏంటి?” అని అడగండి. నీకు బాగా నచ్చిన పని ఏంటి? అని ఆమె పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లండి. మీ జీవితంలోని కొన్ని విషయాల్లో ఆమె సలహాను కోరండి. అది ఆమెకు తను ఇప్పటికీ మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనే భావనను కలిగిస్తుంది.
తల్లితో ప్రతిరోజూ మాట్లాడటం వేరు, ఆమె మనసుతో మాట్లాడటం వేరు. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా కేవలం బాధ్యతగా కాకుండా, ఒక స్నేహితుడిలా ఆమెతో కబుర్లు చెప్పండి. ఆమె ముఖంలో వచ్చే ఆ చిన్న నవ్వు మీరు ఇచ్చే ఏ బహుమతికన్నా గొప్పది.
