2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య విజయాలు సాధించిన ఇండియా కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమాధానం దాటవేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు 2027 ఎన్నికల పొత్తు గురించి ప్రశ్నించగా, అఖిలేష్ యాదవ్ సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రస్తుతానికి మా దృష్టి మొత్తం ప్రజల సమస్యలపైనే ఉంది. 2027 గురించి అప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది అని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతామని బలంగా చెప్పిన అఖిలేష్, ఇప్పుడు ఇలా స్పందించడం కూటమిలో విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోంది.
ఎస్పీ-కాంగ్రెస్ మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే.ఇటీవల జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన సీట్లతో ఉత్తరప్రదేశ్‌లో తమ బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. 2027లో ఎక్కువ సీట్లు కావాలని ఆశిస్తుండటం అఖిలేష్‌కు రుచించడం లేదని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో తామే ప్రధాన ప్రతిపక్షమని, కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తమ ఉనికికి దెబ్బ తగులుతుందని ఎస్పీ కేడర్ ఆందోళన చెందుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ యంత్రాంగం ఇప్పటికే 2027 ఎన్నికల కోసం సన్నద్ధమవుతుంటే, విపక్ష కూటమిలో ఇలాంటి అనిశ్చితి నెలకొనడం అధికార పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది.
మేము కలిసి ఉన్నాం.. కలిసి పోరాడుతాం అని గతంలో నినదించిన నేతలు, ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడటానికి సంకోచించడం ఇండియా కూటమి ఐక్యతపై నీలి నీడలు కమ్ముకున్నాయని స్పష్టం చేస్తోంది.
