‘భారతీయుడు 3’పై బిగ్ అప్‌డేట్..

విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘భారతీయుడు 3’పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ‘భారతీయుడు 3: వార్ మోడ్’ పేరుతో సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

సుమారు మూడు దశాబ్దాల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. లంచగొండితనంపై సేనాపతి చేసిన వీరోచిత పోరాటం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండో భాగం ‘భారతీయుడు 2’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా వెనుకబడటంతో, మూడో భాగం విడుదలపై సినీ వర్గాల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి.

అన్ని అనుమానాలకు సమాధానం చెబుతూ నిర్మాతలు తాజాగా స్పష్టతనిచ్చారు. సేనాపతి తిరిగి వస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు. ఈసారి ఆయన ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోస్టర్‌లో పేర్కొన్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో కమల్ హాసన్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించిన లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మరియు అధికారిక విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.